రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంది. బుధవారం (ఆగస్టు 9) కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం 19 వేల సీట్లను వివిద బ్రాంచులకు కేటాయించాల్సి ఉంది. కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు రిపోర్టు చేయకపోవడం వల్ల మిగిలిపోయిన 18 వేల సీట్లతో కలిపి మొత్తం 30,013 సీట్లను రెండో విడతలో కేటాయించారు. ఐతే రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి.
రెండో విడతలో సీట్లు పొందినా 7 వేల మంది వరకూ విద్యార్ధులు ఆయా కాలేజీల్లో చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 19 వేల వరకూ సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజాగా జరిగిన తుది విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే సీటు రద్దవుతుంది. తుది విడతలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది.









