– సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్
– ఈసారి గవర్నర్ కొత్త అస్త్రం
– ఆర్టికల్ 175(2) ప్రకారం అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌కు లేఖలు
బీఆర్‌ఎస్ సర్కార్‌కు గవర్నర్‌కు మధ్య మళ్లీ రగడ నెలకొంది. పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై కొత్త అస్త్రాలు ఉపయోగిస్తుండటమే ఇందుకు కారణం. గతంలో.. బిల్లులను తన వద్ద పెండింగ్‌లో ఉంచడానికి ఆర్టికల్ 200ను వినియోగించుకున్న గవర్నర్ తాజాగా శాసన సభ్యులకు ఆర్టికల్ 175(2)ను ప్రయోగించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లుల్లో గవర్నర్ 3 బిల్లులను తిప్పిపంపిన సంగతి తెలిసిందే. వాటిపైనే ఆమె అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ కు లేఖ రాసినట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి ఏ విషయంపై అయినా గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు.
కానీ అందుకు భిన్నంగా ఈసారి స్పీకర్, చైర్మన్ ద్వారా తన లేఖలను శాసనసభ, మండలి సభ్యులకు పంపించడం గమనార్హం. ఈ అధికరణం ప్రకారం గవర్నర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాసే వీలుండడంతో తమిళిసై దాన్ని ఉపయోగించుకున్నారు. గవర్నర్ సందేశం గురించి స్పీకర్ సభకు తెలిపి.. ఆ లేఖ ప్రతులను సభ్యులందరికీ అందజేసినట్లు తెలుస్తోంది.









