మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో.. మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటానంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే.. కేటీఆర్.. సడెన్‌గా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?.. అసలెక్కడ చేశారు?.. ఇప్పుడు చూద్దాం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. సిరిసిల్లలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి.. ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. అటు.. ప్రతిపక్షాల తీరుపైనా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు ఓట్లు అడగడానికి వస్తే.. ప్రభుత్వ పథకాలు చెప్పి నిలదీయాలన్నారు. బీసీబంధు లోన్ కాదు.. గ్రాంట్ మాత్రమేనని.. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు చెప్తేనే పెన్షన్ పెంచలేదని.. రాబోయే రోజుల్లో మరోసారి పెన్షన్ పెంచే అవకాశం ఉందని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ప్రజలు గమనించాలని సూచించారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా… ఆ సమయంలోనే.. వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు రేపారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. అన్నారు మంత్రి కేటీఆర్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.









