వాహనాలు గాల్లో ఎగరడాన్ని సాధారణంగా యాక్షన్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఒక కారు ఏకంగా ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్ఫారటా రోడ్డులో వేగంగా వస్తున్న ఒక కారు కల్వర్టును ఢీకొట్టి సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతికష్టం మీద కారును కిందకి దించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటికి పెద్ద రంధ్రం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.









