టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్ బస్‌భవన్ ప్రాంగంణంలో కొత్త ప్రొటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఒలెక్ర్టా గ్రీన్‌టెక్ కంపెనీ సిబ్బందిని అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రేటర్‌లో తొలిదశలో 50 ఎలక్ర్టిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి తేవాలని గతంలోనే ఆర్టీసీ నిర్ణయించింది.
వాటిలో 20 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో, మరో 30 ఐటీ కారిడార్‌లో నడపనున్నారు. ఆ 50 బస్సుల్లో 25 బస్సులు త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 12 మీటర్ల పొడవుండే ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 35 సీట్లుంటాయి. ఇందులో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. బస్సులో మూడు సీసీ టీవీ కెమెరాలుంటాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్‌డీఎ్‌సఎ్‌స)ను ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.









