విశాఖలో విషాద ఘటన జరిగింది. సూసైడ్ లెటర్ రాసి తొమ్మిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాకలోని కైలాస్ నగర్‌కు చెందిన పెంట అఖిల్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతడు ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.. అఖిల్ మృతదేహం దగ్గర ఓ సూసైడ్ నోట్ లభించింది. అఖిల్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అఖిల్ రాసి లేఖలో.. ‘నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తుంది. నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తుంది’ అని ఉంది. దీంతో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడి వయసు 16 ఏళ్లే కావడం.. తొమ్మిదో తరగతి చదివే వయసులో ప్రేమ వ్యవహారంతో ప్రాణాలు తీసుకోవడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









