బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన విజయశాంతి.. మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలా ఎందుకు వెళ్లిపోయారని మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. రాములమ్మ ట్వీట్ చేశారు.
తాను కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న రాములమ్మ.. కార్యక్రమం నచ్చకనో, ఎవరిమీదో అలిగో వెళ్లిపోయాననటం సరికాదంటూ చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డిని అభినందించి.. శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే.. నాడు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి.. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం తనకు అసౌకర్యం కలిగిస్తోందని.. అలాంటి వారు ఉన్న దగ్గర తాను ఉండటం అసాధ్యమని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చిందని స్పష్టం చేశారు.
అయితే.. ఆ కార్యక్రమానికి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ప్రత్యేక తెలంగాణను కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యతిరేఖించిన విషయం తెలిసిందే.









