తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరమైన వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే.. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం ఏర్పడగా… ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అంటే.. 22, 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అయితే.. దీంతో పాటు జులై 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా గట్టిగానే పడనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.









