భద్రాచలం వద్ద పరిస్థితి సమీక్షించిన మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ శాఖ నేడు వర్షాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించింది. నిన్న వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తన నెమ్మదిగా పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు..
ఈ రోజు భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.









