AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. నేడు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు పడనుండగా.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

4వ తేదీ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక 5వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అలాగే 6,7వ తేదీల్లో కూడా వర్షాలు పడనున్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడ్డాయి. నిన్న కామారెడ్డి జిల్లా పరిధిలోని తడ్వాల్‌లో 36.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. లింగంపేట్‌లో 21.4 మి.మీ, సంగారెడ్డి పరిధిలోని జోగిపేటలో 22.2 మి.మీ, యాదాద్రి భువనగిరి పరిధిలోని రామన్నపేటలో 16.4 మి.మీ, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో 14 మి.మీ నమోదైంది. ఇక వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. దాదాపు అన్ని ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదవుతున్నాయి.

ANN TOP 10