హైదరాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల దాడులు చేపట్టిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, పలువురిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించారనే వార్తలతో రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీస్ అధికారులు ప్రశ్నిస్తుండగా.. కొత్త విషయాలు బయటపుడుతున్నాయి. తాజాగా ISKP ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ లింక్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంతో సూరత్‌కు చెందిన సబెర భాను, హైదరాబాద్‌కు చెందిన ఖదీజా అలియాస్ అబిదాను కొద్దిరోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించగా.. అనేక కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరు మహిళలు ISKP విస్తరణ కోసం దేశవ్యాప్తంగా నెట్వర్క్ పెట్టుకున్నట్లు గుర్తించారు. వీరిద్దరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేయడమే కాకుండా యూత్‌ను రాడికలైజ్ ISKPలో చేర్చుకున్నారని తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన కొంతమంది ఉగ్రవాదులతో వీరికి లింకులు ఉన్నట్లు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు.









