ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లోని ఓపెన్ స్కైస్‌లోని ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ వంటి ఆంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. వివేకా హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. అంతేకాదు సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారణకు చేపడుతోంది.
నిందితులకు ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? అనేదానిపై ఫోకస్ చేసింది ఈడీ. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలియగానే వైసీపీ కీలక నేతల్లో వణుకు మొదలైంది. దాదాపు అంతా అయిపోయిందని భావించిన తరుణంలో ఈడీ దిగడం వెనుక ఏం జరిగింది? అనేదానిపై ఆ పార్టీ చర్చ మొదలైంది. ఈ కేసులో ఎవర్నైనా ఈడీ అరెస్ట్ చేస్తే.. కనీసం ఏడాది వరకు బెయిల్ రాకపోవచ్చని అనుకుంటున్నారు. మరి ఈడీల సోదాల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. కొత్త విషయాలు ఏమైనా బయటకు వస్తే.. సీబీఐ మళ్లీ దర్యాప్తు చేసే అవకాశముందన్న వార్తలు లేకపోలేదు.








