AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్‌..

భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు విడిచి వచ్చిన గర్భిణి అనుకోని కష్టంలో పడింది. 18 నెలల కుమారుడు విశాఖ రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌నకు గురవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినా సాయంత్రం వరకూ పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఈ ఉదంతంపై విశాఖ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలివి.. కొంగరి భవానీది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి. భర్త వేధింపుల నేపథ్యంలో బిడ్డని ఏమైనా చేస్తారేమోనని భయపడి ఇల్లు విడిచి వెళ్లిపోవాలని భావించి రైలెక్కింది. విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫామ్‌పై రాత్రంతా ఉండిపోయింది.

గురువారం తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఒక జంట ఆమెతో పరిచయం చేసుకొని మాటలు కలిపారు. తరువాత తన పక్కనే బిడ్డను పడుకోబెట్టుకున్న ఆమె నిద్రలోకి జారుకుంది. కొంత సమయం తరవాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. ఒడిశా జంట కూడా కనిపించ లేదు. దీంతో స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసుల్ని ఆమె ఆశ్రయించింది. హుటాహుటిన తనిఖీలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ సి.ఐ కోటేశ్వరరావు తెలిపారు. భవానీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.

ANN TOP 10