బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి ఏ పార్టీలో చేరుతారనే సస్పెన్స్ కు తెరపడనుందా? వీరు ఏ గూటికి చేరుతారు? కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా? లేక కాషాయ కండువా కప్పుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటీకి సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది.
అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు ఈ ఇద్దరు లీడర్లు. అప్పటి నుంచి వీరు ఏ పార్టీలో చేరుతారు? అనే దానిపై జోరుగా చర్చ సాగుతుంది. జూపల్లి, పొంగులేటి గతంలో కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరోవైపు ఇటు నాగర్ కర్నూల్, అటు ఉమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి బలముంది. ఈ క్రమంలో వారు కాంగ్రెస్ గూటికే వెళ్తారని కొందరూ.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీలోకి వెళ్తారని కొందరూ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీల కీలక నేతలు వీరితో వేర్వేరుగా సమావేశమై తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఆ తర్వాత కూడా పార్టీ చేరికపై మౌనంగా ఉంటున్న పొంగులేటి, జూపల్లి.. నేడు దీనిపై క్లారిటీ ఇస్తారనిపిస్తుంది. అందుకు కారణం.. కర్నాటక ఎన్నికల ఫలితాలు. కర్నాటక ఫలితాలు వచ్చిన తర్వాతే.. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.ఈ అంచనాలను నిజం చేస్తూ.. నేడు పార్టీ చేరికపై తుదినిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. భారీ మెజార్టీతో గెలిచి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఇక కర్నాటక విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే ఊపుమీదున్న కార్యకర్తల్లో..ఇది మరింత ఉత్సాహాన్ని నింపింది.దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని టాక్. ఇక కాంగ్రెస్ గెలుపుతో.. పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలోనే చేరతారని.. అది దాదాపు ఖాయమైందని రెండు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్గా ఈ ఆత్మీయ సమావేశం ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి.. అంతాకలిసి జూన్ 2న కాంగ్రెస్ లో చేరే యోచననలో ఉన్నట్టు సమాచారం. కాగా కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది.









