కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతం అయ్యింది. అధికారంలో ఉన్న కమళం పార్టీకి ప్రజలు వీడ్కోలు పలికారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.విశ్లేషకుల అంచనాలకు మించి కన్నడీగులు కాంగ్రెస్ కు అధికారాన్ని అందించారు.పాలక పక్షంగా ఉన్న బీజేపీని ప్రతిపక్షంగా నిలబెట్టారు.
హోరాహోరీగా సాగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను అధిగమించి కన్నడ నాట హస్తం పార్టీ సత్తాచాటింది. దేశరాజకీయాల్లో కీలకంగా మారిన కర్నాటక అసెంబ్లీ ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చిపెట్టాయి. రాజకీయ సంప్రదాయాన్ని పాటిస్తున్న కన్నడ ప్రజలు.. కాంగ్రెస్ కు సక్సెస్ ను అందించారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ కర్నాటకలో ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేసింది. మొత్తం 224 స్థానాలకు 104 చోట్ల గెలిచి అధికారపార్టీగా కొలువుదీరింది.80 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఇక స్థానికంగా అత్యంత ప్రధానమైన జేడీఎస్ మాత్రం 37 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఐదేళ్ల సుదీర్ఘ పాలనలో కన్నడ ప్రజలను మెప్పించినప్పటికీ.. సంప్రదాయాన్ని పాటించకుండా మాత్రం ఆపలేకపోయింది.కన్నడిగుల ఆచారాన్ని నియంత్రించడంలో ఓడిపోయింది. పాలనతో ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను బీజేపీ గాలికొదిలేసింది.ముఖ్యంగా రాష్ట్ర రాజధాని, ఐటీ క్యాపిటల్ బెంగళూరులో పాలకుల నిర్లక్ష్యం బీజేపీని దెబ్బకొట్టింది. అత్యంత ఖరీదైన జనజీవనం కలిగిన బెంగళూరులో.. బీజేపీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మెట్రోపాలిటన్ సిటీ అయిన ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది. వసతులు కొరత ఉండటంతో గతేడాది కురిసిన అకాల వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. దీని ప్రభావంగా ఐటీ రంగంలో కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.పలు ఐటీ కంపెనీలతో పాటు అపార్ట్‌మెంట్ సముదాయాల్లోకి నీరు చేరడంతో.. చాలా అసహ్యకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ల నివాసితులలో ఐదు శాతం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. రియల్ ఎస్టేట్ పునఃవిక్రయం విలువ క్రాష్ అయింది.దీంతో బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్వాన్నంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.కేవలం బెంగళూరులో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ పాలకుల నిర్లక్ష్యం ఈ ఎన్నికల్లో తీవ్రప్రభావాన్ని చూపించాయి.
ఇదిలా ఉండగా.. కర్నాటక ఎన్నికల్లో జోడో యాత్ర గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. కన్నడ ప్రజలను ఆకర్షించడంలో జోడోయాత్ర కీలక పాత్ర పోషించింది. రాహుల్ పాదయాత్ర ప్రభావంతో ప్రజలు హస్తంకే మొగ్గుచూపారు. బీజేపీపై ఉన్న అసంతృప్తి.. ప్రజలను జోడోయాత్ర కాంగ్రెస్ వైపుకు మళ్లించింది. 136 రోజుల పాటు ప్రజల సమస్యలపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ. రాహుల్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, భరోసా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. జోడో యాత్ర ప్రభావం ఓట్ల రూపంలో తిరిగివచ్చింది.
ఇక బీజేపీ మెనిఫెస్టో సైతం కర్నాటక ప్రజలను ఆకట్టుకోలేకపోయింది.సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ మెనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికీ.. ప్రజలు మొగ్గు చూపలేదు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం సైతం బెడిసికొట్టిందనే చెప్పాలి. ముస్లింల రిజర్వేషన్ లు రద్దు చేస్తామని,విద్యా, అభివృద్ధికి పాటుపడతామన్న కాషాయ లీడర్ల హామీలకు ప్రజలు అట్రాక్ట్ కాలేకపోయారు. ఇక ప్రచారం విషయానికొస్తే.. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతల ప్రచారం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. రెండోసారి అధికారంలోకి కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడంలో బీజేపీ పెద్దల వ్యూహాలు ఫలించలేదు. ఫైనల్ గా ప్రజల తీర్పు కాంగ్రెస్ కే అధికారాన్ని కట్టబెట్టింది.
ఇక కన్నడ తీర్పు తెలంగాణలో కీలకం కానుంది. తెలంగాణలో ఊపుమీదున్న కాంగ్రెస్.. పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. యువనేతలు,జిల్లాల్లో బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకుని.. గెలుపుకు పునాదులు వేస్తుంది.ఈ క్రమంలోనే కర్నాటక గెలుపు కాంగ్రెస్ కు మరింత బలం చేకూర్చింది. కార్యకర్తల్లో జోష్ నింపింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర, పీసీసీ కార్యక్రమాలతో పరుగులు పెడుతున్న పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ప్రియాంక గాంధీ బహిరంగ సభ సైతం కాంగ్రెస్ ప్లస్ కానుంది. ఈ పరిణామాలన్నింటీ మధ్య తెలంగాణలోను కాంగ్రెస్ పుంజుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖయామని తెలుస్తోంది.









