AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి..! త్వరలో పార్టీ పేరు వెల్లడి..

వైసీపీకి రాజీనామా చేసి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి, తన పార్టీ విషయంలో కీలక అడుగు ముందుకేశారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించకముందే, తన భావజాలాన్ని, లక్ష్యాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఒక సన్నాహక గీతాన్ని గురువారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “సాయన్న పేరులోనే సాయముందిరా.. విజయసాయిరెడ్డి అన్న అడుగులోనే విజయముందిరా!” అంటూ సాగే ఈ గీతం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ పేరును నవంబర్ 11న ప్రకటించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రకటనకు కొద్దిరోజుల ముందే ఈ పాటను విడుదల చేయడం ద్వారా, ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తన అనుచరుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే ఈ గీతాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా, అత్యంత కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ప్రస్థానం అనూహ్య మలుపులు తిరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలైన నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి క్రమంగా దూరం జరుగుతూ వచ్చారు. ఈ పరిణామాల మధ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.

వైసీపీతో బంధం తెంచుకున్న తర్వాత ఆయన ఏదైనా జాతీయ పార్టీలో చేరతారని లేదా మరో ప్రాంతీయ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఆ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ, ఆయన సొంతంగానే రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

ANN TOP 10