AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాకిస్థాన్‌ కదలికలపై భారత్‌ అప్రమత్తం.. జైస్వాల్‌ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా తయారీ ఎస్‌హెచ్‌-15 స్వీయ చోదక హోవిట్జర్లను మోహరించినట్లు వచ్చిన వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. వారపు మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ, జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఆత్మరక్షణ కోసం అవసరమైన ఏ చర్యలైనా తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ తన ఫిరంగి దళాల ఆధునికీకరణలో భాగంగా భారత్‌కు ఎదురుగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 250 చైనా తయారీ ఎస్‌హెచ్‌-15 చక్రాలపై ప్రయాణించే స్వీయ చోదక హోవిట్జర్లను మోహరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ తగిన విధంగా స్పందించిందని జైస్వాల్ గుర్తుచేశారు. సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా ఆగిపోవాలన్నదే భారత్ వైఖరి అని స్పష్టం చేశారు.

ఇదే సమావేశంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలపైనా జైస్వాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఎన్నికలను పూర్తిగా బూటకమని అభివర్ణిస్తూ.. ప్రజల నిరసనలను అణచివేసేందుకు పాకిస్థాన్ బలప్రయోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజల అసంతృప్తికి అణచివేత, బెదిరింపులు, విద్యుత్‌ నిలిపివేతలు, బలప్రయోగంతో స్పందిస్తూ.. ఎన్నికల ప్రక్రియ ద్వారా పాలనకు చట్టబద్ధత కల్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీఓకేలో పరిస్థితులపై పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలబెట్టాలని ఆయన కోరారు.

ANN TOP 10