AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..!

బీజేపీ నేతలది ఉత్త మాటలేనని, చేతల్లో ఎలాంటి చర్యలు ఉండవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో ట్యాక్స్‌లపై ఆరోపణలు చేయడం తప్ప, ఆ వ్యవహారాన్ని అరికట్టేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్ వేదికగా కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏ బిల్డర్‌ను, డెవలపర్‌ను అడిగినా ట్యాక్స్ వాస్తవమేనని చెబుతారని పేర్కొన్నారు.

ట్యాక్స్ పేరుతో చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నది వాస్తవమని, ఈ విషయం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ హైదరాబాద్‌కు వస్తుంటారని గుర్తుచేశారు. హైదరాబాద్ పర్యటనల సందర్భంగా ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తుంటారని పేర్కొన్నారు. ట్యాక్స్ పేరుతో భారీగా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న మోదీ, అమిత్ షాలు.. ఆ వసూళ్లపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని బిల్డర్లు, డెవలపర్లకు ట్యాక్స్ వాస్తవం తెలిసినప్పుడు, కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలియదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాలు స్వయంగా ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ ఆరోపణలు చేయడం, తిరిగి వెళ్లిపోవడం తప్ప ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం వైఖరిని వ్యంగ్యంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని వ్యాఖ్యానించారు. దోపిడీ ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు, అదే అంశంపై చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చనుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి యువ నాయకుల చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ANN TOP 10