హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, ఫ్యూచర్ సిటీ పరిధిలో అంతర్గత ట్రాఫిక్ రద్దీని తగ్గించి, హైస్పీడ్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా లింక్ రోడ్ల నిర్మాణం, కల్వర్టుల విస్తరణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.140 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రధానంగా బెంగళూరు జాతీయ రహదారి-844, శ్రీశైలం జాతీయ రహదారి-765 నుంచి నాగార్జునసాగర్ రహదారి వరకు అనుసంధానాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. మంజూరైన నిధులతో కీలక పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా, మీర్‌ఖాన్‌పేట జంక్షన్ నుంచి మేడపల్లి, మల్కీజుగూడ, నందివనపర్తి మీదుగా యాచారం జంక్షన్ వద్ద నాగార్జున సాగర్ రహదారిని కలిపే రోడ్డుకు రూ.18 కోట్లు కేటాయించారు. అలాగే, మేడిపల్లి నుంచి నానక్‌నగర్, పిల్లిపల్లి మీదుగా తాడిపర్తి వరకు, కుర్మిద్ద నుంచి మీర్‌ఖాన్‌పేట జంక్షన్ వరకు రూ.35 కోట్ల చొప్పున నిధులతో రోడ్లను నిర్మించనున్నారు. శ్రీశైలం జాతీయ రహదారి నుంచి రాచలూరు-తిమ్మాపూర్ జంక్షన్ వరకు రూ.20 కోట్లతో, రాచలూరు జంక్షన్ నుంచి కొనల్‌గూడ జంక్షన్ వరకు రూ.22 కోట్లతో, కొనల్‌గూడ నుంచి యాచారం జంక్షన్ వరకు రూ.30 కోట్లతో లింక్ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ లింక్ రోడ్ల నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.7 కోట్లు వెచ్చించనున్నారు.
ఈ పనులన్నీ ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని ఎఫ్‌సీడీఏ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే పలు గ్రామాల పరిధిలో లింక్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా, ఫ్యూచర్ సిటీ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ఎగ్జిట్-13 నుంచి అమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి వరకు 41.5 కిలోమీటర్ల పొడవున, 100 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం ఇప్పటికే జరుగుతోంది.
ఈ లింక్ రోడ్ల నిర్మాణంతో పాటు, ఫ్యూచర్ సిటీలోని పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాల్లో సిగ్నల్స్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేసి, వాటిని జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. మీర్‌ఖాన్‌పేట్, యాచారం, తిమ్మాపూర్, రాచలూరు, కొనల్‌గూడ వంటి ప్రాంతాల్లో మేజర్ జంక్షన్లను ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణ హైదరాబాద్ కారిడార్‌లో రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ప్రయాణం వేగవంతం కావడమే కాకుండా, భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్‌ను తట్టుకునేలా పటిష్ఠమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి.









