AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

బెంగాల్ లోని సోనార్ పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్ బెనర్జీ ఓ గ్రామంలో పర్యటిస్తుండగా ఆయనపై రాళ్లు, గుడ్లు, చెప్పులతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా దొంగ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయనపై భౌతిక దాడికి సైతం యత్నించారు.

 

బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం సోనార్ పూర్ కు చెందిన టీఎంసీ కార్యకర్త సంజూ కర్మాకర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన్ను పరామర్శించేందుకు ఇవాళ అభిషేక్ బెనర్జీ వెళ్లగా ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ బెనర్జీపై దాడికి యత్నించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆయన చొక్కా చినిగి ఉండటం కూడా వీడియో కనిపించింది. అభిషేక్ కు రక్షణగా పోలీసులు తమ హెల్మెట్ ను ఆయనకు ధరించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటు చేసుకున్నట్లు వైరల్ అవుతున్న దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

 

తనపై జరిగిన దాడి ఘటనపై అభిషేక్ బెనర్జీ స్పందించారు. దీనివెనుక బీజేపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ‘వారు నన్ను చంపాలని అనుకున్నారు. ఈ ఘటన మెుత్తం కెమెరాలో రికార్డ్ అయ్యింది. మేము ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. గవర్నర్ కు కూడా తెలియజేస్తాం. నేను తప్పకుండా న్యాయపోరాటం చేస్తా. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర. ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న దృక్పథానికి ఇదే నిదర్శనం. ఎన్నికలు జరిగి కనీసం నెల కూడా గడవలేదు. అప్పుడే దాడులకు యత్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు’ అని అభిషేక్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన 26 రోజుల తర్వాత అభిషేక్ బెనర్జీ తొలిసారి బయటకు వచ్చారు. సోనాపూర్ సౌత్ తో పాటు బేలేఘాటాలో ఎన్నికల అనంతరం దాడులు ఎదుర్కొన్న టీఎంసీ కార్యకర్తల కుటుంబాలని ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరగడం బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. మరోవైపు దీదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీఐడీ ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి నోటీసులు పంపింది. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం తమ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని సీఎం సువేందు అధికారి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

ANN TOP 10