రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా హడావుడిలో మునిగితేలుతున్నారు కానీ, కాస్త గ్రౌండ్ రియాలిటీ లోకి వచ్చి చూస్తే ఈ సినిమా చుట్టూ జరుగుతున్న హడావుడి అంతా కేవలం ఓవర్ హైప్ మాత్రమేనా అనే డౌట్స్ రాక మానవు. సినిమా రిలీజ్ కి మరో ఆరు రోజులే ఉంది,అప్పుడే బాక్సాఫీస్ వద్ద ఏదో జరిగిపోతోందని సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.
గేమ్ చేంజర్ ఒక పెద్ద ఎగ్జాంపుల్
ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని చెప్తున్నా, నిజానికి అక్కడ కేవలం కొన్ని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో మాత్రమే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికా మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ అందుకునే సినిమా అవుతుందని మేకర్స్ కలలు కంటున్నారు. కానీ, గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన క్రేజ్‌ను, ఈ సినిమాతో పోల్చడానికి లేదు. రాజమౌళి బ్రాండ్ లేకుండా రామ్ చరణ్ సోలోగా మార్కెట్‌ను ఎంతవరకు లాగగలడనే దానికి గతంలో వచ్చిన గేమ్ చేంజర్ ఒక పెద్ద ఎగ్జాంపుల్.
జీఎస్‌టితో కలిపి ఏకంగా రూ.600
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడంపై కామన్ ఆడియన్స్ నుండి ఫుల్ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయ్.జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చి, టికెట్ ధరను జీఎస్‌టితో కలిపి ఏకంగా రూ.600గా నిర్ణయించడం చూస్తుంటే, ఒక సామాన్య సినిమా అభిమానిని నిలువునా దోచుకోవడమే అనిపిస్తోంది. కేవలం రెండున్నర గంటల సినిమా కోసం ఇంత భారీ మొత్తం పెట్టడం ఏ రకంగా న్యాయమో ఆ చిత్ర యూనిట్‌కే తెలియాలి.
ఇలాగే రేట్లు పెంచితే థియేటర్లు ఖాళీనే
సినిమా కంటెంట్ మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి రేట్ల పెంపుతో మొదటి వీకెండ్ లోనే పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవాలని చూస్తుంటారు. అలాగే విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం పక్కన పెట్టి, కొన్ని వారాల తర్వాత ఓటిటిలోనే చూసుకోవచ్చులే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. గతంలో ‘సైరా నరసింహారెడ్డి’ లేదా ‘వినయ విధేయ రామా’ సినిమాల సమయంలో కూడా ఇలాగే రేట్లు పెంచి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చిన సంగతి అందరికీ గుర్తే.
ఆంధ్రప్రదేశ్ లాగే తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతులు లభిస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే ‘పెద్ది’ తొలి రోజు, తొలి వీకెండ్ వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే అందరి చూపు తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపైనే ఉంది. అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే ‘ఓపెనింగ్స్ అంతకుమించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు కానీ, ఒకవేళ అక్కడ రేట్లు పెంచకపోతే ఈ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటనేది పెద్ద ప్రశ్నార్థకం.
పైగా జూన్ మొదటి వారంలో స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ అయ్యే సమయం కావడం, సాధారణంగానే ఆడియన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండే తరుణంలో ఈ రేట్లతో థియేటర్లకు రావడం అంటే సాహసమనే చెప్పాలి. ఒకవేళ సినిమా టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా, ఈ భారీ టికెట్ రేట్లే సినిమాను ఘోరమైన డిజాస్టర్ వైపు నెట్టేయడానికి ప్రధాన కారణం అవుతాయి. హైప్ అనేది కేవలం ఓపెనింగ్స్ వరకే హెల్ప్ అవుతుంది, లాంగ్ రన్‌లో నిలబడాలంటే మాత్రం కంటెంట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే .








