వైసీపీ నేత, వినుకోండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడుపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సైబరాబాద్ శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం చేసిన ముఠాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే బొల్ల బ్రహ్మానాయుడు, అతని సోదరుడు బొల్ల రమేష్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
భూకబ్జా యత్నానికి సంబంధించి నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో నిందితులపై కేసు నమోదైనట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టైన వారిలో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు బొల్ల రమేష్, సునీల్, రాధాకృష్ణ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
గండిపేటలోని సర్వే నెంబర్ 18 ప్రభుత్వ భూమిపై నిందితులు నకిలీ పత్రాలు సృష్టించినట్లు డీసీపీ తెలిపారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ఫేక్ జీఓలు వైరల్ చేశారని ఆరోపించారు. ఐదు ఫేక్ జీవోలను తయారు చేసి ప్రభుత్వం ఈ భూమిని తమకు అప్పగించినట్లుగా ప్రచారం మొదలు పెట్టారని అన్నారు. ఇదంతా గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన తన ఫిర్యాదుతో ఈ భూ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు.
మరోవైపు కోర్టు ఆదేశాలతో ఇప్పటికే నిందితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ భూమిపై హక్కులు తమకు ఉన్నాయంటూ నిమ్మల కుటుంబం గత కొన్నేళ్లుగా క్లెయిమ్ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు సైతం నిందితులు దాఖలు చేశారు.
ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ లో నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో చట్టబద్ధ హక్కులు లేకున్నా.. ఎకరాకు 3.5 కోట్లు చొప్పున భూమి అమ్మకానికి నిందితులు కుట్ర చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. బొల్లా రమేష్, బ్రహ్మ నాయుడులతో భూమి అమ్మకానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రెండుసార్లు నిమ్మల ఫ్యామిలీకి డబ్బు ట్రాన్స్ ఫర్ చేశారు. ఒకసారి కోటి, మరోసారి రూ.25 లక్షల నగదు బదిలి చేశారు. మెుత్తంగా ఈ అక్రమ డీల్ లో రూ. కోట్లు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించినట్టు నకిలీ జీఓలు తయారు చేయడంతో పాటు, ఫోర్జరీ పత్రాలతో భూమి యాజమన్యం హక్కులను చూపించే ప్రయత్నం ముగ్గురు నిందితులు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కాగా ఫేక్ జీవోలు, ఫోర్జరీ పత్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. భూమి కొనుగోలు చేసే ముందు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులు తప్పనిసరిగా చెక్ చేయాలని ఆయన సూచించారు.









