ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ ‘దక్షిణ కోస్తా రైల్వే’ (SCoR) జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు, తూర్పు కోస్తా రైల్వే (ECoR)లోని వాల్తేరు డివిజన్‌ను పునర్‌వ్యవస్థీకరించి ‘విశాఖపట్నం డివిజన్’గా మార్చి కొత్త జోన్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని హామీ మేరకు ఈ ప్రాంతంలో రైల్వే పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
ఈ పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఆరు డివిజన్లు ఉండగా, ఇకపై హైదరాబాద్, నాందేడ్, పునర్‌వ్యవస్థీకరించిన సికింద్రాబాద్ డివిజన్లతో మాత్రమే SCR కొనసాగుతుంది. కార్యకలాపాల సౌలభ్యం కోసం పలాస-ఇచ్ఛాపురం, రాయచూరు-వాడి వంటి కొన్ని సెక్షన్లను కూడా సర్దుబాటు చేశారు.
కొత్త జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు, పాలనా సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జూన్ 1న కార్యకలాపాలు ప్రారంభించేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. విశాఖలో తాత్కాలిక భవనంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.








