కర్ణాటక అధికార పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లీడర్ షిప్ మారుతుందని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా చెప్పలేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా సాగుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం వంటి ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో అధికార ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఖాయమైంది.
కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు
కర్ణాటకలో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమైంది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సిద్ధరామయ్య. గురువారం ఉదయం సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు సిద్దరామయ్య.
కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య నుంచి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకోవడం, ఇరువురు నేతలు ఆలింగనం చేసుకోవడం జరిగిపోయింది. వాటికి సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజీనామా చేసిన సీఎం సిద్ధరామయ్య.. సిద్దరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్న డీకే
సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. గురువారం గవర్నర్‌తో సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ కోరినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం బెంగుళూరుకు చేరుకుంటారని సమాచారం. ఆ తర్వాత గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందజేయనున్నారు.
అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డీకే శివకుమార్ ఓ లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. డీకే కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది మంత్రులు ఉండనున్నారు? ఇప్పుడున్న మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారా? లేకుంటే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు లేకపోలేదు. మిగతా రెండేళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారని, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవచ్చని అంటున్నారు.
రెండురోజుల కిందట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేలు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 8 నుంచి 10 గంటలపాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో ఇరువురు నేతలు చర్చించారు. బుధవారం ఉదయం సీఎం, డిప్యూటీ సీఎంలు బెంగుళూరుకు చేరుకున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది.








