AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హీట్ వేవ్..! ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు..

దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్టయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచనలు చేశారు. పౌరులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హీట్ వేవ్

 

గడిచిన నెల రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

 

వేడి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన చేశారు. నిత్యం తగినంత మంచి నీటినీ తీసుకోవాలన్నారు. ఎక్స్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు తెలియజేశారు. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్పా ప్రజలు బయటకు వెళ్లవద్దని అన్నారు. తీవ్రమైన వేడి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని, వృద్ధులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.

 

ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు.. ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు

 

సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలన్నారు. ఇళ్లు, దుకాణాల వద్ద ఆరు బయట పక్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. తల తిరగడం, వికారం, అలసట వంటి వడ దెబ్బ లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు. చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా అకస్మాత్తుగా సృహ కోల్పోయినా, నీరసంగా ఉన్నట్లు కనిపించినా వెంటనే వారిని నీడ ప్రదేశానికి తీసుకువెళ్లాలన్నారు.

 

వేడి గాలుల సమయంలో వీలైనప్పుడల్లా వృద్ధులైన తల్లిదండ్రులు, తాతా, బామ్మలకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పిల్లలు, వృద్ధులు, రైతులు, కార్మికులపై ఎక్కువగా ఉంటోందన్నారు.

 

రాబోయే రోజుల్లో ఢిల్లీ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, బీహార్, ఒడిశా, తెలంగాణ, కోస్తా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడ గాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, మధ్య భారతంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలు దాటేస్తున్న విషయం తెల్సిందే.

ANN TOP 10