రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ కారణంగా నిరాశ్రయులైన బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత గవర్నర్‌ను కోరారు. మంగళవారం ఆమె ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, పలువురు బాధితులతో కలిసి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీ చేసిన భూసేకరణ నోటీసును రద్దు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు. అలాగే, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్పు, ఇతర భూసేకరణ సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల ఇళ్లను కూల్చివేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఒక నిర్దయుడైన ముఖ్యమంత్రి అని, కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన అందిస్తోందని ఆమె విమర్శించారు. వంద రూపాయల చీరలు పంచి బాధితులను లక్షాధికారులను చేశానని సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
తమ పోరాటాల ఫలితంగా వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో భూమి కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ ప్రక్రియలను నిలిపివేసిందని కవిత తెలిపారు. ఇవి పాక్షిక విజయాలని, సంపూర్ణ న్యాయం కోసం కేంద్రం ప్రమేయం అవసరమని, అందుకే గవర్నర్‌ను కలిశామన్నారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని, అన్ని అంశాలపై నివేదిక తెప్పించుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో మరోసారి ఉద్యమబాట పడతామని ఆమె హెచ్చరిం
చారు.








