కాషాయం పార్టీకి కొత్త టెన్షన్ మొదలైందా? కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను చుట్టేస్తోందా? జెన్ జెడ్ మాదిరిగా కాక్రోచ్ జనతా పార్టీ వీర విహారం చేస్తోందా? యూత్‌ని ఎక్కువగా టార్గెట్ చేస్తోందా? దాని సెగ కేంద్ర ప్రభుత్వానికి తగులుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాను చుట్టేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ
సుప్రీంకోర్టు సీజేఐ చేసిన మాటలు సోషల్ మీడియాలో కొత్త రాజకీయ ఉద్యమానికి దారి తీసినట్టు కనిపిస్తోంది. మై భీ కాక్రోచ్ అంటే నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’-CJP సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆన్‌లైన్‌లో సంచలనం రేపుతోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై హాస్యంగా ప్రస్తావిస్తూ లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది.
కేవలం మూడు రోజుల్లో లక్ష మంది యువత సభ్యులుగా చేరాలంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి లేని యువతను ఉద్దేశిస్తూ కాక్రోచెస్‌లా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన మాటలు వైరల్ అయ్యాయి. పరిస్థితి గమనించిన సీజేఐ మరుసటి రోజు దాని సమయం, సందర్భం చెప్పుకొచ్చారు.
కేవలం మూడు రోజుల్లో లక్ష మంది.. తోడవుతున్న యువత
తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారన్నారు. దేశ యువతను నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశించి అన్నానని తెలియజేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు మే 16న కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుండి సీజేపీ ఎక్స్‌లో 38 వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 4,20,000 మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
పార్టీ ప్రారంభమైన నుండి లక్ష మంది తమ పార్టీలో చేరారని పేర్కొంది. అందులో టీఎంసీకి చెందిన మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజీత్ దీప్కే స్టూడెంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని రూపకల్పన చేశారు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అనేది ఆ పార్టీ యొక్క ప్రధాన నినాదం.
నిరుద్యోగులు, సోమరులు, ఆన్‌లైన్‌లో ఉండేవారు సభ్యులుగా చేరవచ్చని ప్రకటించారు. అది ప్రారంభమైన 48 గంటల్లో వెబ్‌సైట్ వచ్చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, సీబీఎస్ఈ రీచెక్కింగ్ ఫీజులు రద్దు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇది యువత గొంతుకగా మారుతోందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
యువత చాలా అవగాహనతో ఉన్నారని, తమ అసంతృప్తిని ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తారని చెబుతున్నారు వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. తన అధికారిక సోషల్ మీడియాలో ఐదు సూత్రాల అజెండాను ప్రస్తావించింది. వాటిలో మాజీ న్యాయమూర్తి పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీటు ఇవ్వరాదు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్, పార్టీ ఫిరాయింపు నేతలను 20 ఏళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించడం, చట్టబద్ధమైన ఓటు తొలగింపు, మీడియా సొంతంగా వ్యవహరించడం వంటివి ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు నిశితంగా పరిశీలన చేస్తున్నారు.








