ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు అదనపు డీజీలు, సీపీలు, ఐజీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాల నియంత్రణ, శాఖల మధ్య సమన్వయంపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
డ్రగ్స్ నియంత్రణ & పోలీస్ ప్రమోషన్లు
రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన బాధితుల కోసం ప్రత్యేకంగా డి-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి నాన్-క్యాడర్ ఐపీఎస్ అధికారుల వరకు ప్రమోషన్ వచ్చిన తర్వాత.. వారు తప్పనిసరిగా రెండేళ్ల పాటు ఇతర విభాగాలలో పని చేసేలా కొత్త విధానాన్ని తీసుకురావాలన్నారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
సైబర్ క్రైమ్ , సాంకేతికతపై ఫోకస్
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. ఇందుకోసం ఫోరెన్సిక్, డేటా సెంటర్ల సంఖ్యను పెంచాలని, స్కిల్స్ యూనివర్సిటీలో పోలీస్ విభాగం కోసం సైబర్ క్రైమ్ అంశంపై ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టాలని సూచించారు. అంతేకాకుండా, అభ్యర్థుల పోలీస్ శిక్షణ సమయంలోనే సైబర్ విభాగానికి అవసరమైన వారిని ఎంపిక (సెలక్షన్) చేయాలన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణ
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై విజిలెన్స్ విభాగం కఠినంగా వ్యవహరించాలని, డేటా అనాలిసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ కేవలం ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మున్సిపల్, హైడ్రా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ జూన్ 15 లోగా నివేదిక ఇవ్వాలని గడువు విధించారు.
ఫ్లెక్సీల నియంత్రణ
నగరంలో నాలాల మెయింటెనెన్స్ కోసం మెట్రో వాటర్ వర్క్స్‌తో, అలాగే మ్యాన్ హోల్స్ నిర్వహణ కోసం పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, మున్సిపల్ శాఖలు ఉమ్మడిగా సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను పూర్తిగా నియంత్రించాల్సిందేనని, దీనిపై పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.








