గాజువాక నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఐటీ మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి అంశాలపై సవివరంగా చర్చించారు.
ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గాజువాకలో ఐటీ రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి భారీ ఐటీ పెట్టుబడులు తీసుకురావడంలో కృషి చేస్తున్న నేపథ్యంలో గాజువాకలో కూడా ఐటీ రంగాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. యారాడ కొండపై ఉన్న సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమి, ఆగనంపూడి వద్ద రెఫ్రాక్టరీస్‌కు సంబంధించిన 175 ఎకరాల భూమి ఐటీ రంగ అభివృద్ధికి అనువైన ప్రదేశాలుగా ఉన్నాయని సమావేశంలో ప్రతిపాదించారు.
ఈ భూములను ఐటీ, నాలెడ్జ్ మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు వినియోగిస్తే స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మొత్తం సుమారు 600 ఎకరాల భూమిని ఐటీ అభివృద్ధికి అనువుగా పరిశీలించాలని అధికారులను కోరారు.
ఉక్కు నిర్వాసితుల సమస్యలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష
విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. స్టీల్ ప్లాంట్-సనివాడ మధ్య బౌండరీ వాల్ వివాదం చాలాకాలంగా కొనసాగుతోందని పేర్కొంటూ, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామందికి ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఇళ్ల పంపిణీ, డౌట్‌ఫుల్ ఆర్-కార్డ్స్ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
గతంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, ఎంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు, ప్రస్తుతం ఎంత భూమి ఆక్రమణలకు గురైంది, ఇంకా ఎంతమంది స్థలాల కోసం వేచి ఉన్నారు వంటి అంశాలపై పూర్తిస్థాయి రికార్డు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఉక్కు భూసేకరణ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఇంకా ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో పూర్తి వివరాలు తక్షణమే సమర్పించాలని కోరారు. విశాఖ విమల విద్యాలయానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలు, జెట్టి నిర్మాణంపై చర్చ
గంగవరం పోర్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలపై కూడా విస్తృత చర్చ జరిగింది. గంగవరం పోర్టుకు సంబంధించిన జెట్టి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏ దశలో ఉందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్వాసితులకు ఉపాధి ప్యాకేజీ కింద సుమారు 400 మందికి డబ్బులు చెల్లించినట్లు చెబుతున్న నేపథ్యంలో, ఆ వివరాలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. అలాగే గంగవరం నిర్వాసితుల జీవనభృతి, పరిహారం అంశాలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ఫార్మా కాలనీకి సంబంధించిన ఏపీఐఐసీ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీలలో ఇంకా సుమారు 300 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉందని నిర్వాసితులు చెబుతున్నారని, రెండు దశాబ్దాలుగా వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. వీరిలో కొద్దిమంది నకిలీ లబ్ధిదారులు ఉంటే వారిని తొలగించి అసలైన నిర్వాసితులకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. అవసరమైతే అదనపు భూమి అవసరంపై ప్రభుత్వం స్థాయిలో చర్చించి కేటాయింపులు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
జీవీఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ముంపునకు గురికాకుండా ఉన్న గెడ్డలు, పిల్లకాల్వలను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని పరిశీలించాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. మూడు దశాబ్దాల క్రితమే గెడ్డలు, వాగుల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న సుమారు ఆరు వేల కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో చెరువులు, గెడ్డలు కాని ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారికి క్రమబద్ధీకరణ చేసి సొంత గూడు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మీడియా ముసుగులో ఇబ్బందులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
గాజువాకలో ఇళ్లు నిర్మించుకుంటున్న పేద వర్గాలను కొంతమంది మీడియా ముసుగులో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో జీవీఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లైబ్రరీలకు కేటాయించిన భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో, ఆ అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పూర్తి వివరాలు అందించాలని కోరారు. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా శాఖల మధ్య సమన్వయంతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన పల్లా శ్రీనివాసరావు, గాజువాక నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నిర్వాసితుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.








