బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంలో హైకోర్టు న్యాయమూర్తి పై సోషల్ మీడియాలో కొందరు పెట్టిన అనుచిత పోస్టులపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం తాజాగా మరో సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ శ్వేత కు సిట్ కు ఇన్ ఛార్జ్ గా నియమించారు.
మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు బీఎన్ఎస్ తోపాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే బండి భగీరథ్ కోసం గాలింపు చేపట్టారు. దాంతో బండి భగీరథ్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి విచారణ జరిపారు.
అయితే, విచారణ జరపటానికి ముందే కొంతమంది సోషల్ మీడియాలో బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవీ దేవి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ అనుచిత పోస్టులు పెట్టారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపినపుడు జడ్జి మాధవీ దేవి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రచారం తనను బాధకు గురి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది.
ఈ క్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయగా దీనిపై చార్మినార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ ప్రారంభించి నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. కాగా, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రభుత్వం మంగళవారం సిట్ ఏర్పాటు చేసింది. దానికి ఇన్ ఛార్జ్ గా హైదరాబాద్ జాయింట్ సీపీ శ్వేతను నియమించారు.








