తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాతో పంచుకున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారని సుదర్శన్ రెడ్డి వివరించారు. ప్రతి ఓటర్‌కు రెండు ఫామ్‌లు అందుతాయన్నారు. అందులో ఒకటి నింపి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రెండో ఫామ్‌ను ఓటరు తమ వద్దే అక్‌నాలెడ్జ్‌మెంట్ కింద ఉంచుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు కోసం voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యుమరేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్యుమరేషన్ ఫామ్‌ల ఆధారంగా జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. దీన్ని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. అలాగే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఈ డ్రాఫ్ట్‌పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చని సుదర్శన్ రెడ్డి తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. తెలంగాణలో దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు.







