జీవశాస్త్రంలో శాస్త్రవేత్తలు సరికొత్త సంచలనం సృష్టించారు. చరిత్రలో తొలిసారిగా, పూర్తిగా జీవం లేని రసాయనాలతో ఒక కృత్రిమ కణాన్ని ప్రయోగశాలలో విజయవంతంగా తయారుచేశారు. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కేట్ ఆడమాలా, ఆరోన్ ఎంగెల్‌హార్ట్ నేతృత్వంలోని బృందం ఈ ఘనత సాధించింది. ‘స్పుడ్‌సెల్’ అని పేరు పెట్టిన ఈ కణం, ఒక జీవిలాగే ఆహారం తీసుకోవడం, పెరగడం, తన జన్యుపదార్థానికి (డీఎన్ఏ) డూప్లికేట్ తయారు చేసుకుని విభజన చెందడం వంటి పనులు చేయగలదు.
ఈ ఆవిష్కరణలో కీలకమైన అంశం ఏమిటంటే, దీనిని ‘బాటమ్-అప్’ పద్ధతిలో, అంటే సున్నా నుంచి నిర్మించారు. గతంలో శాస్త్రవేత్తలు ఉన్న కణాల జన్యువులను మార్చి ప్రయోగాలు చేయగా, ఈ బృందం మాత్రం సింథటిక్ డీఎన్‌ఏ, ఎంజైమ్‌లు వంటి నిర్జీవ రసాయనాలను ఉపయోగించి దీనిని సృష్టించింది. కేవలం 90 కేబీపీ పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మమైన జన్యువుతో ఈ కణం పనిచేయడం మరో విశేషం.
‘స్పుడ్‌సెల్’ ఒక సాధారణ కణంలాగే పోటీతత్వాన్ని కూడా ప్రదర్శించింది. పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు, కొన్ని కణాలు వేగంగా పెరిగి మిగతా వాటిని అధిగమించాయి. ఇది జీవ పరిణామ క్రమాన్ని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కణం ఇంకా పూర్తిస్థాయి జీవి కానప్పటికీ, ఇది ఒక ప్రాథమిక నమూనా అని వారు పేర్కొన్నారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో వైద్యం, ఔషధాల తయారీ, పర్యావరణ అనుకూల పారిశ్రామిక ఉత్పత్తులు, బయో ఫ్యూయల్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకునేందుకు ‘బయోటిక్’ అనే సంస్థను కూడా ప్రారంభించారు. జీవం యొక్క పుట్టుక రహస్యాలను ఛేదించడంలో కూడా ఈ పరిశోధన ఒక మైలురాయిగా నిలవనుంది.








