ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందజేసే భోజనం నాణ్యతను పెంచడంతో పాటు, పర్యవేక్షణను మెరుగుపరిచి జవాబుదారీతనాన్ని పటిష్ఠం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పీఎం-పోషణ్ (మధ్యాహ్న భోజనం) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అదే భోజనాన్ని స్వీకరించడం వల్ల ఆహార పరిశుభ్రత, పోషక విలువలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఫలితంగా ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.








