AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

భారత భూభాగంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్న పాకిస్తాన్ తీరుపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ గనుక తన వంకర బుద్ధిని మార్చుకోకుండా భారత్‌కు వ్యతిరేకంగా కవ్వింపులు కొనసాగిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న ఆయన.. కానీ తమ సహనాన్ని బలహీనతగా భావిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని తేల్చి చెప్పారు.

 

దిల్లీలో మానేక్ షా సెంటర్ లో ‘యూనిఫామ్ అన్ వీల్డ్’ పేరిట జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ కు దారితీసిన పరిస్థితులు.. మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తితే భారత సైన్యం ఎలా ప్రతిస్పందన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. భారత్ వ్యతిరేకంగా కార్యాకలాపాలు కొనసాగిస్తోందని అన్నారు. భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపకపోతే.. భౌగోళికంగా (భూమ్మీద) ఉండాలా? లేదా కేవలం చరిత్రలో భాగం కావాలా? అనేది పాకిస్థానే డిసైడ్ చేసుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

పాకిస్తాన్ చర్యలకు భారత సైన్యం సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెబుతుందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ వంటి చర్యలను గుర్తు చేస్తూ.. అవసరమైతే దేశ రక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని అన్నారు. భారత సైన్యం అధునాతన సాంకేతికతతో పూర్తి సన్నద్ధతతో ఉందనే విషయాన్ని దయాది దేశం గుర్తుంచుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రదర్శించిన సంయమనాన్ని ఈసారి చూపించమని.. మరింత దూకుడుగా ముందుకు వెళ్తామని ఆర్మీ చీఫ్ వెల్లడించారు.

 

మరోవైపు ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయని ఆర్మీ చీఫ్ అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ పాక్ తన సొంత ప్రజల క్షేమాన్ని వదిలేసి భారత్‌పై ద్వేషాన్ని పెంచడానికే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా పాక్ తన వైఖరిని మార్చుకోకపోతే అంతర్జాతీయంగా మరింత ఒంటరి కావడం ఖాయమని హెచ్చరించారు.

 

అటు సరిహద్దు వెంబడి నిఘాను మరింత కఠినతరం చేశామని ఆర్మీ చీఫ్ తెలియజేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం 24 గంటలూ అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజల రక్షణను కాపాడటంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ను భారత సైన్యం చేపట్టిన సంగతి తెలిసిందే. 88 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చింది

ANN TOP 10