చిరు లీక్స్ ….సోషల్ మీడియాలో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పిట్ట కథ ఈవెంట్ లో ఆచార్య సినిమా పేరుని అనుకోకుండా చిరు లీక్ చేయడంతో మొదలైన ఈ లీకుల పరంపర ఆ తర్వాత చాలా విషయాల్లో కంటిన్యూ అయింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ట్రైలర్ ని చూశానంటూ,ఆపైగా అందులోని ఒక డైలాగ్ ని కూడా చిరు లీక్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ట్రైలర్ ప్యూర్ పవర్ ప్యాక్డ్‌గా, ఫైర్‌లా ఉందంటూ
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మే 18న ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే చిరంజీవి ఈ ట్రైలర్‌ను ముందే చూసేయడంతో కంట్రోల్ అవలేక ఇప్పుడే ‘పెద్ది’ ట్రైలర్ చూశానని, జస్ట్ వావ్ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పెద్ది టీమ్ ని ఆకాశానికి ఎత్తేశారు.దాదాపు మూడు నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్ ప్యూర్ పవర్ ప్యాక్డ్‌గా, ఫైర్‌లా ఉందంటూ మెచ్చుకున్నారు మెగాస్టార్.
చరణ్, బుచ్చిబాబు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారని, అందరూ కలిసి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేశారని చిరు ఎంతో ఎగ్జైటింగ్‌గా చెప్పుకొచ్చారు.ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ దాన్ని మించి ఉంటుందని, ఇందులో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయంటూ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెప్పారు.
ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్
ఇక ఎప్పటికప్పుడు తన సినిమాలు లేదా చరణ్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ముందే లీక్ చేస్తూ అభిమానులను అలరించే మెగాస్టార్, ఈసారి కూడా తన ‘చిరు లీక్స్’ అలవాటును రిపీట్ చేశారు. చాలా రోజుల తర్వాత మీకు లీక్ ఇస్తున్నానంటూ ‘పెద్ది’ ట్రైలర్‌లోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు..” అనే డైలాగ్ ట్రైలర్‌లో మైండ్ బ్లోయింగ్‌గా ఉందంటూ లీక్ చేసిన చిరంజీవి, ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబుకు సరదాగా సారీ చెప్పారు. “సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్ చేయాల్సి వచ్చింది” అంటూ చిరు చమత్కరించిన తీరు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరు స్వయంగా ఇచ్చిన ఈ లీక్ అండ్ రివ్యూతో ‘పెద్ది’ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్
మే 18న రాబోతున్న ట్రైలర్
రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా (RC16) తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరగనుంది ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అదే తరహా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ, ‘దేవర’ ఫేమ్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ పాట, గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించగా, జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మే 18న రాబోతున్న ట్రైలర్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి మరి.







