AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత కొత్త పార్టీ..! పార్టీ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తన తదుపరి రాజకీయ అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారా? అంటే తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. రాజకీయ పరిణామాలను గమనిస్తూనే సందర్భాను సారం గళం విప్పుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు తెరవెనుక రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, వామపక్ష శక్తులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఆమె కసరత్తు ప్రారంభించారు. పార్టీ ఏర్పాటుకు ముందే క్షేత్రస్థాయిలో బలమైన పునాది వేసేందుకు కవిత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

 

కవిత వరుస భేటీలు

గత కొంతకాలంగా కవిత తన రాజకీయ పంథాను మార్చుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రజాస్వామ్యవాదులు, మేధావులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సీపీఐ, సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీలతో పాటు, వివిధ ప్రగతిశీల సంఘాల నేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పలు ఉద్యమ సంఘాలను కూడా ఈ కొత్త వేదికలోకి ఆహ్వానించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్న ఈ శక్తులన్నింటినీ ఏకం చేయడం ద్వారా ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలన్నదే కవిత వ్యూహంగా కనిపిస్తోంది.

 

కేరళలో సీపీఎం కూటమికి..

ఒకప్పుడు కేవలం అధికార పార్టీ కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు వామపక్ష పార్టీలు, ప్రగతిశీల శక్తులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. సామాజిక న్యాయం, ప్రజా సమస్యలపై పోరాడే శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. లెఫ్ట్ పార్టీలు, ప్రగతి శీల శక్తులు, ఉద్యమ సంఘాలతో కలిసి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం చేయబోతున్నట్లు సమాచారం. కేరళలో సీపీఎం కూటమికి ఓటేయాలని కవిత పిలుపు ఇచ్చారు. ఇది భవిష్యత్ లో వేయబోయే అడుగులకు సూచిక అనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో భవిష్యత్ లో కమ్యూనిస్టు నాయకత్వంతో కలిసి నడిచే అవకాశం లేకపోలేదని సమాచారం. సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో కలిసి ప్రజా క్షేత్రంలోకి వెళ్లడం ద్వారా తన రాజకీయ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని ఆమె యోచిస్తున్నారు. ఇప్పటికే కవిత చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు కమ్యూనిస్టుల మద్దతు సైతం కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఖమ్మం వెలుగుమట్లలో ధర్మసమాజ్ పార్టీతో నిరాహార దీక్ష.. పరిగిలోనూ బీఎస్పీతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కవిత వ్యూహాత్మక అడుగులు వేస్తుండటంతో ఆమె ఏర్పాటు చేసే పార్టీకి మారోజు వీరన్న పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది.

 

ఉద్యమకారుల సంఘాలు

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కవిత గళం వినిపిస్తున్నారు. ప్రకటించబోయే పార్టీకి ఉద్యమకారుల కుటుంబాలకు ఆహ్వాలు పంపారు. ఉద్యమకారులందరికి ఇళ్ల స్థలం, ఇళ్లు, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఉద్యమకారులు, సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలుముమ్మరం చేసింది. ఇప్పటికే ఉద్యమకారుల సంఘాలు ఆమెకు సంఘీభావం సైతం ప్రకటించాయి. మరికొన్ని సంఘాలు సైతం ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రగతిశీల ఉద్యమ సంస్థలు సైతం కవిత రాజకీయ పార్టీ వైపు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు కవితను కలిసి సంప్రదింపులు సైతం జరిపినట్లు సమాచారం.

 

మాజీ మావోయిస్టులు..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు వ్యతిరేకంగా కవిత ఇప్పటికే గట్టిగా గళం వినిపించారు. ఆదివాసీల హక్కులు, పౌర హక్కుల పరిరక్షణ విషయంలో ఆమె తీసుకున్న స్టాండ్ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీ మావోయిస్టులు సైతం ఆమెకు మద్దతుగా నిలుస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అణగారిన వర్గాల గొంతుకగా మారడం ద్వారా తన రాజకీయ అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. దండకారణ్యం వీడి జన జీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గడిచిన రెండు రోజులుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు కవితతో భేటీ అవుతున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యల పై ఉద్యమించడం.. సమస్య పరిష్కారం అయ్యే వరకు దానిపై వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించడం.. ప్రజాస్వామిక పంథాను ఆచరణలో చూపించడంతో కవిత ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ వైపు మాజీ మావోయిస్టులు చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కొందరు ముఖ్య నాయకులు కవిత పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

ముందుకు సాగేందుకు ప్రణాళికలు

వచ్చే ఎన్నికల నాటికి ఒక స్పష్టమైన రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కవిత అడుగులు వేస్తున్నారు. కేవలం భావోద్వేగాలతో పార్టీ ప్రకటన కాకుండా, పక్కా సిద్ధాంత బలంతో ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రగతిశీల ఎజెండా.. వామపక్షాల అనుభవం.. ఉద్యమకారుల ఆకాంక్షలతో ముందుకు సాగేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. “తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా సాంస్కృతిక ముద్ర వేసుకున్న కవిత, ఇప్పుడు ‘ప్రగతిశీల రాజకీయ యోధ’గా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అచితూచి వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.

ANN TOP 10