AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ పచ్చజెండా..!

తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.

 

ఆర్టీసీని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. అప్పటి పాలకులు కార్మికుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించారో అందరికీ తెలుసని, కానీ తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. గత పాలకుల తరహాలో మొండిగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చల ద్వారా ఒక కొలిక్కి వద్దామని ఆయన కార్మిక నేతలకు పిలుపునిచ్చారు.

 

ఈ సమావేశంలో జేఏసీ నేతలు మొత్తం 32 డిమాండ్లను మంత్రుల బృందం ముందు ఉంచారు. వీటిలో ఇప్పటికే 29 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మిగిలిన మూడు కీలక డిమాండ్లయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు అధికారిక గుర్తింపు, పీఆర్‌సీ (PRC) అమలుపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బోర్డు పరిధిలోని అంతర్గత సమస్యలను యాజమాన్యం చూసుకుంటుందని, ప్రభుత్వ పరిధిలోని ఆర్థిక, విధానపరమైన అంశాలను తాము పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

ANN TOP 10