తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన వెళ్లడానికి ముందే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్‌తో ఇప్పటికే బండి సంజయ్ భేటీ అయ్యారు. నిన్న రెండు గంటలపాటు తరుణ్ చుగ్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులపై బండి సంజయ్ చర్చించారు. రాష్ట్ర పరిస్థితులు, పార్టీలో చేరికలు, పార్టీ బలోపేతం, అక్రమ అరెస్టులపై తరుణ్ చుగ్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టి సారించింది.
బీజేపీ ముఖ్య నేత, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రెండు రోజుల పాటు ఢిల్లీలోని పార్టీ అగ్ర నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీని విజయం దిశగా నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్య నేతలు సునీల్ బన్సల్, శివప్రకాశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌తో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు జూపల్లి కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులను చేర్చుకునే విషయమై నేతలతో చర్చించినట్లు సమాచారం. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బుధవారం ఢిల్లీకి వచ్చారు. తరుణ్ ఛుగ్ నివాసం వద్ద ఈటల, సంజయ్ ముఖాముఖి ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు. బండి సంజయ్ జాతీయ పార్టీ ముఖ్యులతో పాటు కేంద్రమంత్రులను కూడా కలుసుకొనే అవకాశం ఉంది.