AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభలో వీగిపోయిన మహిళా బిల్లు.. ప్రజాస్వామ్య విజయం అన్న సీఎం రేవంత్ రెడ్డి..!

భారత పార్లమెంటరీ చరిత్రలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్) లోక్‌సభలో వీగిపోయింది. ఈ పరిణామంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌ (X) వేదికగా స్పందిస్తూ, దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. విపక్షాల ఐక్యత వల్ల ఒక జాతీయ విపత్తు తప్పిందని ఆయన పేర్కొన్నారు.

 

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), కులగణనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేసిన పోరాటం ఫలితాన్నిచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. “లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ఈ నల్ల బిల్లును ఓడించాయి. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.” అని ఆయన ట్వీట్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ మ్యాప్‌ను మార్చే ప్రయత్నాలను అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు.

 

బిల్లును ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ‘ఇండియా’ కూటమి నాయకులకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎం.కే. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్ వంటి హేమాహేమీలు కఠిన పరిస్థితుల్లోనూ సాహసంతో నిలిచారని కొనియాడారు. దక్షిణ భారతం, చిన్న రాష్ట్రాల గొంతు నొక్కే కుట్రను వీరంతా కలిసి అడ్డుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

 

రాజ్యాంగ పరిరక్షణే మా లక్ష్యం: రాహుల్ గాంధీ

ఈ చారిత్రాత్మక పరిణామంపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “మహిళల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన రాజ్యాంగ విరుద్ధమైన ఎత్తుగడలను భారతదేశం గమనించింది. దేశ ప్రజల అప్రమత్తత వల్ల ఆ కుట్ర వీగిపోయింది. ఇది రాజ్యాంగానికి దక్కిన గొప్ప విజయం.” అని పేర్కొన్నారు.

 

ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో కీలక ఘట్టంగా అభివర్ణించారు. “దురుద్దేశంతో కూడిన చట్టాలను ప్రజాస్వామ్య శక్తులు ఏకమైతే అడ్డుకోవచ్చని నిరూపితమైంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి దూరదృష్టి వల్ల దేశానికి ఒక జాతీయ విపత్తు తప్పింది. సమానత్వం కోసం మా పోరాటం ఆగదు.” అని ఆయన స్పష్టం చేశారు.

 

రాజకీయ ఎత్తుగడలు దెబ్బతిన్నాయి: మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. “మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఉత్తర భారతదేశానికి సీట్లు పెంచుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీ డీలిమిటేషన్ కుట్రను కాంగ్రెస్ అడ్డుకుంది. 2023లోనే ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలు చేయకుండా, ఇప్పుడు కొత్తగా షరతులు పెట్టడం మహిళలకు చేసే అన్యాయం. దేశవ్యాప్తంగా కులగణన చేసిన తర్వాతే సవరణలు చేయాలన్న మా డిమాండ్ నెగ్గింది.” అని తెలిపారు.

 

బీజేపీకి చిత్తశుద్ధి లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “మహిళా రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ సబ్ కోటా ఇచ్చేవారు. కేవలం సంపన్నులకే కాకుండా సామాన్య మహిళలకు కూడా అధికారం దక్కాలన్నది కాంగ్రెస్ ఆకాంక్ష. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల లబ్ధి కోసం ఈ బిల్లును తెచ్చారు తప్ప మహిళలపై ప్రేమతో కాదు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.

 

కపట నీతి బహిర్గతమైంది: మంత్రి సీతక్క

మంత్రి సీతక్క మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేస్తూ బీజేపీ తీరును ఎండగట్టారు. “లక్ష్యం మాత్రమే కాదు, మార్గం కూడా పవిత్రంగా ఉండాలి. సింపుల్ మెజారిటీతో రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా, డీలిమిటేషన్‌తో ముడిపెట్టి సంక్లిష్టం చేయడమే బీజేపీ కపట నీతికి నిదర్శనం. మహిళా ప్రధానిని, రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్‌ది. ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి. ఈ రోజు విజయం మహిళల హక్కుల పరిరక్షణకు పునాది.” అని పేర్కొన్నారు.

ANN TOP 10