సివిల్ కోర్ట్ తాత్కాలికంగా ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఆధారంగా సదరు రైతులకు రావాల్సిన రైతు బంధు, రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆక్షేపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన రైతు ఎం. అంజిరెడ్డి భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడమే కాకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, జిల్లా కలెక్టర్ తో సహా సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పరిమితి మాత్రమే..
పిటిషనర్ల భూములు సుమారు 8 ఎకరాలు 32 గుంటలు ఉండగా, సివిల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్‌ను ఆధారంగా అధికారులు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు ప్రయోజనాలను నిలిపివేశారు. అయితే ఆ ఇంజంక్షన్ కేవలం భూమిని విక్రయించకూడదు లేదా బదిలీ చేయకూడదనే పరిమితి మాత్రమే విధించిందని, రైతు సంక్షేమ పథకాలను నిలిపివేయడానికి అది కారణం కాలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్‌లను పిటిషనర్లకు రావాల్సిన రైతు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని, పిటిషనర్ల భూమిలో పండించిన ధాన్యాన్ని ‘ఇందిరా కిసాన్ పథకం’ కింద కొనుగోలు చేయడానికి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది.
చట్టబద్ధం కాదు..
పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎల్. ప్రీతమ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉన్నా రైతు భరోసా నిలిపివేయడం చట్టబద్ధం కాదని, రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ప్రతివాదికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కేసును తదుపరి విచారణకు జూన్ 16కు వాయిదా వేసింది. రైతు సంక్షేమ పథకాల అమలులో అధికారుల చర్యలపై ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా మెదక్ సివిల్ కోర్టు లో సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి ప్రతాప్ రెడ్డి వాదించగా,హైకోర్ట్ లో న్యాయవాది ప్రీతంరెడ్డి వాదించారు.








