నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లు పేరుతో మనకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉందని, డీలిమిటేషన్ తర్వాత ఇది అలాగే ఉండాలని అన్నారు.
బీజేపీ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయదని విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు సీట్లను 50 శాతం పెంచుతామని కిషన్ రెడ్డి చెబుతున్నారని, కానీ డీలిమిటేషన్ బిల్లులో ఆ అంశమే లేదని అన్నారు. కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, 17 లోక్ సభ స్థానాలకు 26 పెరుగుతాయని చెప్పారని తెలిపారు. కానీ బిల్లులో ఈ పెరుగుదల లేదని అన్నారు.
బీజేపీ ఎప్పుడూ తెలంగాణకు మిత్రుడు కాదని విమర్శించారు. 2014 ఏపీ పునర్విభజన బిల్లులోనే సీట్ల పెంపు హామీ ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ అనుకూలమేనని, కానీ డీలిమిటేషన్ బిల్లులో మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.








