AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల బంగారం… అసోచామ్ ఆసక్తికర నివేదిక..

భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ వాణిజ్య మండలి అసోచామ్ తన నివేదికలో సంచలన విషయం వెల్లడించింది. 2024-25, 2026 ఆరంభంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో, భారతీయుల ఇళ్లలో ఉన్న పసిడి విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.464 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంపదలో ఒకటిగా నిలిచింది.

 

అయితే, ఇంత భారీ మొత్తంలో ఉన్న బంగారం సరైన వినియోగంలోకి రావడం లేదని, వినియోగంలోకి వస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారగలదని అసోచామ్ అభిప్రాయపడింది. ప్రతి ఏటా ఇళ్లలోని బంగారంలో కనీసం 2 శాతాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించగలిగితే, దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని విశ్లేషించింది. ఇదే ధోరణి కొనసాగితే, 2047 నాటికి దేశ జీడీపీకి అదనంగా 7.5 ట్రిలియన్ డాలర్లు జతవుతాయని, తద్వారా మన ఆర్థిక వ్యవస్థ 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటగలదని అంచనా వేసింది.

 

ప్రస్తుతం ఇళ్లలో ఉన్న బంగారం చాలా వరకు అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉంది. దీనిని గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, గోల్డ్ లోన్లు, బంగారం ఆధారిత ఆర్థిక సాధనాల ద్వారా వినియోగంలోకి తేవాలని అసోచామ్ సూచించింది. ఇప్పటికే బంగారంపై రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతోందని, నవంబర్ 2025 నాటికి బంగారం, ఆభరణాలపై రుణాలు రూ.24.34 లక్షల కోట్లకు చేరాయని నివేదిక తెలిపింది.

 

ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, భారత్ వద్ద అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. కానీ, ఇళ్లలో ఉన్న ప్రైవేట్ బంగారం నిల్వలు దీనికంటే ఎన్నో రెట్లు అధికమని, ఏ దేశంలోనూ ఇంతటి ప్రైవేట్ బంగారం లేదని అసోచామ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, దేశ దీర్ఘకాలిక వృద్ధి కోసం ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారం ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

ANN TOP 10