హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సామాన్యులే కాకుండా ఉన్నత అధికారుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా మాజీ డీజీపీ మనవరాలు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి పేరుతో సైబర్ క్రిమినల్స్ రూ. 1.2 కోట్ల నగదును కాజేశారు. దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో, ఆమె పరపతిని వాడుకుని నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో ఈ మోసానికి ఒడిగట్టారు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ మోసం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. మార్చి 13న సైబర్ నేరగాళ్లు దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. ఆ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో, పేరు దివ్యారెడ్డివే ఉండటంతో అకౌంటెంట్ నిజమని నమ్మాడు. తాను మీటింగ్‌లో ఉన్నానని, అత్యవసరంగా తాను చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ. 1.2 కోట్లు బదిలీ చేయాలని నిందితులు మెసేజ్ చేశారు. డైరెక్టర్ స్వయంగా మెసేజ్ చేశారని భావించిన అకౌంటెంట్, ఏమాత్రం సందేహించకుండా ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. అయితే మార్చి 17న మరోసారి నగదు కోరుతూ మెసేజ్ రావడంతో అనుమానం వచ్చిన అకౌంటెంట్, డైరెక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ‘డిజిటల్ అరెస్టుల’ పేరుతో పెరుగుతున్న మోసాల పట్ల పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయని, పోలీసులమని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్లలో లేదా వాట్సాప్‌లో నగదు అడగవని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.









