AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సంచలన నిజాలు: 20 సార్లు డ్రగ్స్ సరఫరా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్!

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్‌ను ఎస్‌వోటీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితుడు కౌశిక్ రవి ఈ డ్రగ్స్‌ను సిమ్లా నుండి తెచ్చానని చెప్పినప్పటికీ, తాజా విచారణలో అభిషేక్ సింగ్ ద్వారానే రోహిత్ రెడ్డి అనుచరులకు మత్తు పదార్థాలు అందినట్లు సిట్ (SIT) నిర్ధారించింది. కేవలం ఈ ఒక్క పార్టీకే కాకుండా, గతంలో సుమారు 20 సార్లు ఈ ఫాంహౌస్‌కు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ కేసులో డ్రగ్స్ నెట్‌వర్క్ తీగ లాగితే డొంక కదులుతోంది. గోవా, బెంగళూరులోని నైజీరియన్ల నుంచి కొకైన్, ఎండీఎంఏ వంటి ఖరీదైన మత్తు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీకెండ్ పార్టీలే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాలో రోహిత్ రెడ్డితో పాటు బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డికి కూడా అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడి ఫోన్ డేటా ఆధారంగా అతని కస్టమర్ల జాబితాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

మరోవైపు వివాదాస్పదంగా మారిన అజీజ్‌నగర్ పరిధిలోని రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ భూమి వాస్తవానికి 1961-62లో ఒక వ్యక్తికి కేటాయించిన అసైన్డ్ భూమి అని, నిబంధనలకు విరుద్ధంగా దీనిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో కూడా పాత యజమాని పేరే ఉండటంతో, సిట్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఇక ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల పోలీస్ కస్టడీపై ఉప్పరిపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. కస్టడీకి అనుమతి లభిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ANN TOP 10