AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారిగా నాసా కీలక నిర్ణయం..

అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో తొలిసారిగా, లోతైన అంతరిక్షంలోకి (డీప్ స్పేస్) వెళ్తున్న తమ వ్యోమగాములకు వ్యక్తిగత ఐఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్-2 మిషన్‌లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మిషన్ ద్వారా మానవసహిత యాత్ర 50 ఏళ్లకు పైగా విరామం తర్వాత చంద్రుడి సమీపంలోకి వెళ్తోంది.

 

రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్‌లతో కూడిన నలుగురు వ్యోమగాముల బృందం, ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి రానుంది. ఈ ప్రయాణంలో తమ వ్యక్తిగత క్షణాలను, అద్భుతమైన దృశ్యాలను బంధించేందుకు వీరికి ఐఫోన్లను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

 

వ్యోమగాములు వినియోగించే పరికరాలను ఆధునికీకరించే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించారు. “మా వ్యోమగాములు తమ కుటుంబం కోసం ప్రత్యేక క్షణాలను బంధించుకోవడానికి, ప్రపంచంతో స్ఫూర్తిదాయకమైన చిత్రాలు, వీడియోలను పంచుకోవడానికి అవసరమైన సాధనాలను అందిస్తున్నాం” అని ఆయన గతంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.

 

అయితే, అంతరిక్ష నౌకలోని వ్యవస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, డీప్ స్పేస్ ప్రయాణంలో ఈ ఫోన్లను పూర్తిగా ‘ఏరోప్లేన్ మోడ్’లోనే ఉంచుతారు. అంటే ఇవి కేవలం హై-ఎండ్ కెమెరాలుగా మాత్రమే పనిచేస్తాయి. ప్రయాణ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మీదుగా వెళ్తున్నప్పుడు, అక్కడి వై-ఫైకి కనెక్ట్ అయి ఫొటోలు, ఈ-మెయిల్స్ పంపే అవకాశం ఉంటుంది. కానీ, వాయిస్ కాల్స్ చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన లైవ్ చిత్రాలను తీయడంతో పాటు ఇంతకుముందు మానవ కంటికి కనిపించని కొన్ని ప్రదేశాలను గమనించనున్నారు. అలాగే, లోతైన అంతరిక్షం నుంచి పాక్షిక సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించనున్నారు

ANN TOP 10