రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏప్రిల్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా, ప్రతి నెలా నాలుగో శనివారాన్ని ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్’ దినంగా పాటించాలని, ఆ రోజున గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ‘సంజీవని’ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో విజయవంతంగా అమలవుతున్న సంజీవని ప్రాజెక్టును జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పరీక్షల ఫలితాలను 48 గంటల్లోనే నేరుగా వారి వాట్సప్‌కు పంపాలని ఆదేశించారు. దీనికోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు అవసరమవుతాయని, రూ.162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారు.
సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో ఇప్పటికే 3.14 లక్షల మంది నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించేలా నివారణ ఆరోగ్య చర్యలపై (ప్రివెంటివ్ హెల్త్) దృష్టి పెట్టాలన్నారు.
ఈ సమీక్షలో భాగంగా ఐదు కీలక అంశాలతో ‘ఏపీ హెల్త్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే 5 పిల్లర్లతో ఈ పాలసీని పటిష్టంగా రూపొందించాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ అమలుపైనా చర్చించారు.
మరోవైపు, అనవసర సిజేరియన్లను నివారించాలని, అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సిజేరియన్లు 20 శాతానికి మించితే తప్పనిసరిగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను రేషనలైజేషన్ ద్వారా భర్తీ చేయాలని, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు







