AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా… హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు..

హైదరాబాద్‌లో భారీ అక్రమ గ్యాస్ సిలిండర్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ శ్మశాన వాటికలో అక్రమంగా నిల్వ ఉంచిన 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఈ దందాకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సోమవారం ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు అధిక లాభం కోసం సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. వారి నుంచి 11 రవాణా వాహనాలతో కలిపి మొత్తం రూ.21.88 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

పోలీసుల కథనం ప్రకారం, శంషాబాద్ కేంద్రంగా ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ నిర్వహిస్తున్న మహ్మద్ అమీర్ ఈ రాకెట్‌లో ప్రధాన సూత్రధారి. ఇతను బంజారాహిల్స్‌లోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని శ్మశానంలో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అవసరమైన వారికి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.

 

అరెస్ట్ అయిన వారిలో గ్యాస్ ఏజెన్సీ యజమాని, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, కార్మికులు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో వివిధ కేజీల బరువున్న సిలిండర్లు, డీసీఎం వ్యాన్లు, బొలెరో వాహనాలు, ఆటోలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10