ఇరాన్‌లోని కీలకమైన నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ బాధ్యతారహిత చర్యలు మధ్యప్రాచ్యంలో పెను విపత్తుకు దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న రష్యా ఈ స్థాయిలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రం లక్ష్యంగా శనివారం ఉదయం వైమానిక దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. యురేనియం సంపన్నం చేసే ఈ కీలక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తీవ్రంగా స్పందించారు. “ఈ బాధ్యతారహిత చర్యలను అంతర్జాతీయ సమాజం వెంటనే ఖండించాలి. ఇవి మధ్యప్రాచ్యం అంతటా పెను విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు, ఈ విషయంపై అమెరికా సైన్యం ఇంకా స్పందించలేదు. దీనిపై వివరణ కోరగా సమాధానం రాలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
నటాంజ్ అణు కేంద్రంపై గతంలోనూ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ప్రస్తుత సంఘర్షణలోనూ, గత జూన్‌లోనూ ఈ కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. తాజా దాడిపై ఇరాన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) దర్యాప్తు ప్రారంభించింది. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.








