AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమాన ప్రయాణికులపై యుద్ధ ప్రభావం పడనివ్వం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమానయాన రంగంపై ఉన్నప్పటికీ, ఆ ఆర్థిక భారాన్ని ప్రయాణికులపై పడకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

యుద్ధం కారణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని, అయితే ఆ భారాన్ని ప్రయాణికులకు బదిలీ చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఈ విషయంపై పౌర విమానయాన, విదేశాంగ, పెట్రోలియం శాఖలతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని, విమానయాన సంస్థల నుంచి కూడా నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

దీంతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా పలు కొత్త చర్యలను కూడా రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇకపై విమానాల్లో 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని విమానయాన సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను తరలించే విషయంలో మరింత సరళంగా వ్యవహరించాలని, పెంపుడు జంతువుల ప్రయాణానికి సంబంధించి స్పష్టమైన విధానాలను ప్రవేశపెట్టాలని సూచించారు.

విమానాల ఆలస్యం, రద్దు వంటి సందర్భాల్లో ప్రయాణికులకు అందాల్సిన పరిహారం, వారి హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రాంతీయ భాషల్లోనూ విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. పశ్చిమాసియాలోని కొన్ని విమానాశ్రయాలు ప్రస్తుతానికి పనిచేయడం లేదని, అయినా కీలక మార్గాల్లో ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యానికే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన పునరుద్ఘాటించారు.

ANN TOP 10