AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు..!

తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు, కన్న బిడ్డలకు డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజయనగరంకు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. వ్యక్తిగత స్వార్థం కోసం పిల్లల హక్కులను పణంగా పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

 

 

వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లాకు చెందిన పిటిషనర్, తన భార్య ప్రవర్తనపై అనుమానంతో కోర్టును ఆశ్రయించారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడానికి తన పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కోరారు. తద్వారా ఆ పిల్లలు తనకు పుట్టలేదని నిరూపించి, భార్యపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు… భర్త చేసిన విన్నపం వెనుక ఉన్న ప్రమాదకరమైన కోణాన్ని ఎత్తిచూపారు.

 

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. “భార్యపై ఆరోపణలను నిరూపించడానికి చిన్నపిల్లలను పావులుగా ఉపయోగించడం అత్యంత విచారకరం. ఇది వారి మానసిక స్థితిని, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుంది” అని జడ్జి అన్నారు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నిరూపించడానికి ఇతర మార్గాలు, సాక్ష్యాలు వెతకాలి తప్ప… పిల్లల పుట్టుకను ప్రశ్నిస్తూ డీఎన్ఏ పరీక్షలు కోరడం సరికాదని చెప్పారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్లల హక్కులను, వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడాన్ని అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

 

భార్యపై అనుమానంతో కోర్టు సమయాన్ని వృథా చేస్తూ, పిల్లల భవిష్యత్తుకు భంగం కలిగించేలా పిటిషన్ దాఖలు చేసినందుకు సదరు వ్యక్తికి హైకోర్టు రూ. 3 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా కుటుంబ వివాదాల్లో పిల్లల ప్రయోజనాలే అత్యున్నతమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసినట్లయింది.

ANN TOP 10